మహిళా అధికారులపై పలు మీడియా సంస్థల్లో తప్పుడు కథనాలు ప్రసారం అవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళా అధికారులపై చెప్పలేని భాషలో కొన్ని ఛానల్స్, సోషల్ మీడియాలో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుందని, జిల్లా మంత్రులకు చెప్పి ముఖ్యమంత్రి బదిలీ చేయరని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతారని, అలాంటి వారిపై అబండాలు వేయొద్దని హితవుపలికారు. మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజమని, వాటిని తాము తట్టుకుంటామని, కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందని ప్రశ్నించారు. మా మీద వేస్తే మేము, మా కుటుంబసభ్యులు, బంధువులు బాధపడతారు. రాసినవారు మేము చేసినట్లు చూశారా? దేవుడు అంటే నాకు నమ్మకం, నేను తెలిసి ఏ తప్పు చేయను. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయా. ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. నన్ను అవమానించి ఏం సాధిస్తారు? నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తప్పుడు వార్తల మీద విచారణ జరిపించాలని కోరారు.


