ఉపాధి హామీ పథకాన్ని తీసేశామని బిజెపి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. దేశంలో అనేక మార్పులు, సంస్కరణలు చేస్తున్నామని, మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్చామని తెలియజేశారు. పేదలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశామని, జవాబుదారీ తనాన్ని ఈ పథకంలో తెచ్చామని అన్నారు. గ్రామ పంచాయితీలకు ఉపాధి హామీ పథకం అమలు చేసే అధికారం కల్పించామని, వంద రోజుల పనిదినాన్ని 125 కు పెంచామని పేర్కొన్నారు.
రూ. లక్ష కోట్లతో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని, గ్రామాలవారీగా అభివృద్ధి ప్రణాళికలు రచించుకుని మార్పు చేశామని అన్నారు. ఉపాధి హామీ పథకంలో చాలా అవకతవకలు జరిగాయని, ఒక ఏడాది గుంతలు తవ్వితే, వచ్చే ఏడాది కూడా అక్కడే గుంతలు తవ్వేవారని విమర్శించారు. గ్రామీణ కూలీలకు కూడా నైపుణ్య శిక్షణ పెంచుతామని, విబి- జి రాం జి ద్వారా గిడ్డంకులు నిర్మించాలని నిర్ణయించామని అన్నారు. వ్యవసాయ రంగానికి విబి-జి రాం జిని అనుసంధానం చేస్తామని, రైతుల కోరిక మేరకు విబి-జి రాం జిని తీసుకువచ్చామని చెప్పారు.


