ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తలసాని స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్‌ను ముక్కలు ముక్కలుగా చేస్తే ముక్కలుగా చేస్తా అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని ఆయన తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలుసుకోవాలని సూచించారు.
సికింద్రాబాద్‌ను ముట్టుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ సికింద్రాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్‌లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్ పల్లి సర్కిల్‌లో చేర్చారని ఆరోపించారు. సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీలోనే ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రకటన ప్రజలను మభ్యపెట్టడానికే అంటూ విమర్శించారు. 220ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.


