ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పురాతన జపనీస్ సమురాయ్ యుద్ధ కళ అయిన కెంజుట్సు లో అధికారికంగా ప్రవేశం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రీడలో ఉన్నతస్థాయిని సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ మరోవైపు సినిమా కెరీర్ కొనసాగిస్తూ క్రమశిక్షణ, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. పవన్ సాధించిన విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతకు ఇచ్చారన్నారు. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందని చెప్పుకొచ్చారు. ఫిట్‌నెస్ పట్ల తనకున్న క్రమశిక్షణ, నిబద్ధత ఎంతో మందికి ప్రేరణ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పవన్ చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ.


