సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాజ్కాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇటీవలే రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ ఆవిష్కరించిందని, రైజింగ్ తెలంగాణ-2047లో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా ప్రభుత్వం విభజించిందని, మూడు కీలక రంగాలకు ప్రత్యేకమైన 3 జోన్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణతల్లి ఆవిష్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామని, మేడారం అభివృద్ధి కోసం రూ. 251 కోట్లు కేటాయించామని అన్నారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కిందని గవర్నర్ కొనియాడారు.
26 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సన్నవడ్లపై క్వింటాల్ కు రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. ధాన్యానికి బోనస్ గా రైతులకు రూ.1,780 కోట్లు చెల్లించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. భూవివాదాలు పరిష్కరించేలా భూభారతి చట్టం తెచ్చామని, గ్రూప్-1,2,3 ఉద్యోగాలు భర్తీని పూర్తి చేశామని అన్నారు. ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఐటిఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చామని, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్ గా మార్చాలని నిర్ణయించామని పేర్కొన్నారు. విద్యార్థలకు సమాన అవకాశాల కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కార్యాచారణ చేపట్టామని అన్నారు. బ్యాంక్ ల ద్వారా మహిళలకు రూ. 40 వేల కోట్లు సమకూర్చామని, మహిళలను పెట్రోల్ బంక్ లు, ఆర్టిసి అద్దెబస్సులకు యజమానులుగా చేశామని అన్నారు. మహిళలు ఇప్పటికే 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని, విద్య, వైద్యాన్ని ఈ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని వర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.


