మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెల పూజ అనంతరం రాత్రి వన దేవతలు వన ప్రవేశం చేశారు. గిరిజన సంప్రదాయ డప్పు, డోలు వాయిద్యాలతో వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను గద్దెల నుంచి కన్నెపల్లి, చిలకలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అలాగే పూనుగుండ్లకు (మహబూబాబాద్) పగిడిద్దరాజును తరలించారు. దీంతో నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం జాతర ముగిసింది.నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి వచ్చారు. మహా జాతర వేళ భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.మేడారంలోని జంపన్న వాగుతో పాటు గద్దెల ప్రాంగణం, మ్యూజియం ఇలా వివిధ ప్రాంతాల్లో భక్తజన సందోహం నెలకొంది. ట్రాఫిక్ అంతరాయం, స్వల్ప ఘటనలు మినహా మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది.


