నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హతలేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో సర్ ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా సర్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది.
మన రాష్ట్రంతోసహా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసారి సర్ చేపడుతారు. ఇప్పటికే కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ సర్ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త సర్ మొదలవుతుంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, బిహార్లలో కొనసాగుతోంది. బిహార్లో ముగింపు దశకు చేరుకుంది. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డియులో ఏప్రిల్ నుంచి సర్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సర్ లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు లేని ఓట్లను తొలగిస్తారు.


