కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో పడతారని తెలిపారు. మన దేశంలో కూడా అన్నదాతలు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి పంటలని ఎక్కువగా పండిస్తూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అమెరికా దేశం నుంచి ఈ పంటలను దిగుమతి చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్న రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతులకు సంబంధించిన ఓ కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు. వివిధ స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.


