మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సెలబ్రేషన్స్ కొనసాగుతున్నా యి. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తాజాగా కె.వి. రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు కె రాఘవేంద్రరావు, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి గోపాల్, వివి వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా, బండ్ల గణేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో 400 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.


