తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ఈ మేరకు వెల్లడించారు. జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురం సభలో కొత్త పార్టీని ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ త్వరలో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. మాజీ సీఎం దివంగత జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో ఉండి, దానిపై అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలు ఉన్నాయి.
తమ కొత్త పార్టీ అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చూపిన మార్గంలో పయనిస్తుందని శశికళ తెలిపారు. పేదలు, అణగారిన వర్గాలు, సామాన్య ప్రజల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. జయలలిత మరణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. జయలలితను నేనే చంపానని దుష్ప్రచారం చేశారు. పళనిస్వామిని సీఎం చేసి తప్పు చేశాను. నన్ను పార్టీ నుంచి అవమానకరంగా గెంటేశారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తా. రాజకీయాల్లో నా మార్క్ ఏంటో చూపిస్తా అని అన్నారు.


