యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇక గురువారం సాయంత్రం 4:30 గంటలకు కడువ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం కన్నులపండువగా జరగడం విశేషం. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఈ వేడుకలో ప్రత్యేకంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. వివాహ బంధంతో జీవిత భాగస్వాములుగా మారిన విజయ్ దేవరకొండ, – రష్మిక మందన్న జోడీకి సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఇక మార్చి 4న హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
నోరూరించే రుచులతో విందు
విరోష్ దంపతులు వివాహ వేడుకకు వచ్చిన అతిథుల కోసం పసందైన వంటకాలను వడ్డించారు. రాయల్ వెడ్డింగ్‌లో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ స్పెషల్స్ తో పాటు కర్నాటక స్పెషల్ బిసిబేళా బాత్, కూర్గ్ స్పెషల్ వంటకాలతో పాటు కొడువ సంప్రదాయ వంటకాలను అతిథులకు తినిపించారు. తెలంగాణ, ఆంధ్ర సంప్రదాయ వంటలు అయిన నాటుకోడి పులుసు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, గారెలు, పప్పు, పచ్చి పులుసు, కీమా సమోసాలు కూడా మెనూలో ఉన్నాయి.


