భారత్ – ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ప్రతి సవాల్‌ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య పలు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) జరిగాయి. కృత్రిమ మేథ (ఏఐ), క్వాంటం, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో సహకారాన్ని వేగవంతం చేసేందుకు క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలను వినియోగించేందుకు ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందన్నారు.
వ్యవసాయ రంగంలో సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, దీన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని ప్రధాని చెప్పారు. ఇజ్రాయెల్ సహకారంతో భారత్‌లో ఏర్పాటు చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ విజయవంతం కావడంతో వాటి సంఖ్యను 100కు పెంచనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తుదిరూపు ఇస్తామని పేర్కొన్నారు.


