ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో రైతులకు సహాయంగా రైతు కోసం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం – పొనుకుమాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.10 లక్షల విలువైన బ్యాటరీ ఆధారిత వ్యవసాయ స్ప్రేయర్లు, టార్పాలిన్‌లను 350 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానా సేవలు అభినందనీయమని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఇక్కడి రైతుల కోసం ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తానా సంస్థ చేస్తున్న సేవలను యార్లగడ్డ వెంకటరావు ప్రశంసించారు.
తానా సంస్థ ఎప్పుడూ తెలుగు ప్రజలకు సేవ చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోందని తానా కోశాధికారి రాజా కసుకుర్తి పేర్కొన్నారు. రైతుల శ్రమ దేశానికి పునాది అని వివరించారు. రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పరికరాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతామని చెప్పుకొచ్చారు. రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు తానా ఎల్లప్పుడూ ముందుంటుందని రాజా కసుకుర్తి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, పొనుకుమాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడు సుంకర రాజేశ్, గ్రామ మాజీ అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, గ్రామ పెద్దలు అళ్ల సత్యనారాయణ, కొంజేటి సాంబశివరావు, ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.


