ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్య, ఇందుకు ప్రతిగా ఇరాన్ జరుపుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణలు, డ్రోన్ దాడులపై విరుచుకుపడుతుండటం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోను చేశారు. ఇరువురు నేతలతో సంభాషణల్లో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై ఇరాన్ జరుపుతున్న దాడులను మోదీ ఖండించారు. రెండు దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆరా తీశారు. కాగా, దీనికి ముందు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మోదీ ఫోనులో మాట్లాడారు. ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ధాటించారు.


