ఇరాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతిచెందారు.ఇరాన్ మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. డౌన్‌టౌన్‌లోని ఖమేనీ కాంపౌండ్ లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో 86 ఏండ్ల ఖమేనీ మృతి చెందారని ఆ దేశ మీడియా ప్రకటించింది. ఖమేనీ మృతితో 40 రోజుల సంతాప దినాలతో పాటు ఏడు రోజుల పాటు జాతీయ సెలవు దినాలను ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తోపాటు పలు గల్ఫ్ దేశాలపై దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించగా, అమెరికా తోసిపుచ్చింది. తాజా ఉద్రిక్తతలతో పశ్చిమాసియా పూర్తి స్థాయి యుద్ధం దిశగా నడుస్తున్నది.


