తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగపునారి సమీపంలో ఉత్సాహంగా సాగుతున్న ఈ పోటీలు ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయాయి. క్రీడలో భాగంగా బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపుతప్పి గ్యాలరీలోని ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో తీవ్ర తొక్కిసలాట మరియు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ అనుహ్య ఘటనలో ముగ్గురు వ్యక్తులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఎద్దుల దాడిలో సుమారు 76 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సాధారణంగా జల్లికట్టు పోటీల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, ఎద్దులు అదుపు తప్పి నేరుగా ప్రేక్షకుల జోన్లోకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానిక పోలీసులు మరియు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ విషాదకర ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


