జియో హాట్‌స్టార్ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రస్తుతం ఈ షో చిత్రీకరణ దశలో ఉన్నది. ఈ షోకు చెందిన ఎక్స్‌క్లూజివ్ చిత్రాలు రీసెంట్‌గా బయటకు వచ్చాయి. విశాలమైన మాన్షన్‌లో 10మంది సెలబ్రిటీలు 70రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రేమ, నమ్మకం, సహనం ఈ మూడింటి భాగస్వామ్యాన్ని 24/7 కెమెరాల పర్యవేక్షణలో పరీక్షించే విధంగా ఈ లవ్ మ్యాన్షన్‌ని డిజైన్ చేశారు. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నిరంతరం కెమెరాల నడుమ రూపొందుతున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని మేకర్స్ చెబుతున్నారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ హీరోయిన్ రాధ, లయ ఈ షోకి జ్యూరీగా ఉండటం విశేషం. శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది.
తాజగా మీడియా ప్రతినిధులకు ఈ షోకి సంబధించిన స్పెషల్ ప్రోమోని ప్రదర్శించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ షో ఐడియా, కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఈ మాన్షన్‌లో పోటీ ప్రేమలో కాదు, ఉన్న పది మంది కపుల్స్‌లో ఎవరు స్పోర్టివ్‌గా ముందుకు వెళ్తారనేదే ముఖ్యం. షో అద్భుతంగా జరుగుతోంది. మనం లైఫ్ స్టోరీస్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. అలాంటి అద్భుతమైన పది కపుల్స్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి. ఇలాంటి షోకు జడ్జ్‌గా చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. వాళ్ల లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ వినడం, మనకు తెలిసిన సలహాలు చెప్పడం ఒక కొత్త అనుభూతి. తెలుగులో ఇలాంటి షో ఫస్ట్ టైమ్. శ్రీముఖి హోస్ట్‌గా ఉంటారు. అలాగే నాతో పాటు జడ్జ్‌గా డ్రీమ్ గర్ల్ రాధ ఉండటం ఆనందంగా ఉంది. అలాగే మరో జడ్జ్ లయ చాలా స్పోర్టివ్‌గా వారి లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ షేర్ చేస్తున్నారు అని తెలిపారు.


