కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ, భారత్-కెనడా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పై చర్చలు జరిపేందుకు కూడా అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణుఇంధన కార్యక్రమానికి నిరంతరాయ సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశమని ప్రధాని మోదీ చెప్పారు. చిన్న మాడ్యులార్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని తెలిపారు. అలాగే 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు కార్నీ వెల్లడించారు. 1893లో స్వామి వివేకానంద కెనడా పర్యటనను మార్క్ కార్నీ గుర్తుచేసుకున్నారు.


