అల్లూ వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి నయనికా రెడ్డితో ఈ నెల 6న శిరీష్ వివాహం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా అల్లూ కుటుంబం హైదరాబాద్‌లోని అల్లూ స్టూడియోస్‌లో భారీ స్థాయిలో ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, మోహన్ బాబు, నాని, నాగ చైతన్య, గోపీచంద్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు, అట్లీ, వి.వి. వినాయక్ పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ కూడా ఈ వేడుకలో కనిపించారు.
రాజకీయ వర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, ఏపీ ఉప సభాపతి రఘురాకృష్ణరాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. టొవినో థామస్ హీరోగా తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాసిల్ జోసెఫ్ ఈ వేడుకలో కనిపించడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.


