16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. త్వరలోనే కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించబోతున్నట్లు వెల్లడించారు. పిల్లలపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రభావం పడుతోందని, చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని, దీన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇది ఎప్పటి నుంచి అమలవుతుందో తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే దేశంలో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తుంది. ఏపీ, గోవా ప్రభుత్వాలు దీనిపై ప్రతిపాదన చేసినా.. ఇంకా అమలు దిశగా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా దీనిపై నిర్ణయం తీసుకుని, ఇప్పటికే నిషేధాన్ని అమలు చేస్తోంది. ఫిన్లాండ్, బ్రిటన్ కూడా పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. అలాగే, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు సొంత చట్టాలతో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ విధించాయి. యూరప్‌లోని ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు కూడా పిల్లలు స్కూళ్లలో సోషల్ మీడియా, మొబైల్స్ వాడకంపై నిషేధం విధించాయి.


