దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సోమ వారం నోటీసులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు ఊరట కలిగిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సిబిఐ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదన లు వినిపించారు. సిబిఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా సిబిఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ విచారణాధికారిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు దర్యాప్తు సంస్థ, విచారణాధికారిపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, సిబిఐ కేసులో నిందితులు విడుదలయ్యారు కాబట్టి ఇడి దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా నిలిపివేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు భిన్నంగా స్పందించింది. సిబిఐ రివిజన్ పిటిషన్పై నిర్ణ యం తీసుకునే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.


