ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకు అందరు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ వారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన కీలక సూచనలతోపాటు దిశా నిర్దేశం చేశారు.
భూగర్భ నీటిమట్టం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మే 15 నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకు రైతులను ముందస్తుగా సమాయత్తం చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. వెలుగొండ ఫేజ్-1 ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. కృష్ణా నది కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను పటిష్ట పరచాలని ఆదేశించారు. మార్చి 16వ తేదీన అన్ని జిల్లాలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


