ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలంటూ ఇండియా కూటమి పార్టీలు ఒక తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు ప్రవేశపెట్టారు. తీర్మానం నోటీసుపై 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్‌సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
ఈ తీర్మానానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు లోక్‌సభ సెక్రటేరియట్‌కు అందిందని, నోటీసు పరిశీలన ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమికి దూరంగా ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ సైతం తీర్మానం నోటీసుపై సంతకాలు చేసింది. పలువురు ఇండిపెండెంట్ ఎంపీలు కూడా ఇందులో ఉన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించడానికి నోటీసు ఇవ్వడం భారత పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి.


