ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న అతన్ని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. మద్యం ముడుపుల వ్యవహారంలో షెల్ కంపెనీల ద్వారా భారీగా నగదు లావాదేవీలు జరిగాయని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముప్పిడి అవినాశ్‌రెడ్డి పాత్రపై అధికారులు మరింత సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం కేసులో అరెస్టయిన ముప్పిడి అవినాశ్‌రెడ్డి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో ఆయనను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య అవినాశ్‌రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రత్యేక విచారణ గదిలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ రెండు రోజుల పాటు కొనసాగనుంది. రేపు, ఎల్లుండి కూడా ముప్పిడి అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆయన నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.


