తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రత్యర్ధులను విమర్శించే క్రమంలో కొందరు నాయకులు తమ నోటికొచ్చింది మాట్లాడి వివాదాల్లో నిలుస్తున్నారు. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ మాటల మధ్యలో నోరు జారారు. నాకు నయనతార కావాలి. నా కల నేరవేరుస్తారా? అని ఆయన స్టాలిన్ను ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సందడి మొదలవ్వడంతో తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని టార్గెట్ చేశాయి విపక్షాలు. ఎన్నికల తేదీ రావడంతో ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో మీ కలలు చెప్పండి. మేము నెరవేరుస్తాం? అని సీఎం స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రకటించారు.
విల్లుపురంలో డీఎంకే ప్రభుత్వంపై నిరసన సభలో ముఖ్యమంత్రి కొత్త పథకాన్ని అన్నాడీఎంకే ఎంపీ, మాజీ మంత్రి షణ్ముగన్ విమర్శించారు. అంతటితో ఆగకుండా నాకు నయనతార కావాలి. నా కోరిక నేరవేరుస్తారా. నయనతారను పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాళ్ల కలను సీఎం నిజం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని డీఎంకే నేతలు, దక్షిణాది చిత్రసీమ వర్గాలు సహా పలువురు ఖండించారు.


