మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో షర్మిల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, వివేకా కుమార్తె సునీత మీద చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డానని అన్నారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని సునీతానే చెప్పారని, అవినాశ్‌రెడ్డి మాట్లాడటం చాలా దారుణమని అన్నారు. అవినాశ్‌రెడ్డికి పలుకుబడి, డబ్బు ఉందని, ఎన్ని తప్పులు చేసిన తప్పించుకోవచ్చని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
వివేకానంద గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియాలోనే మొదటగా ప్రచారం చేశారు.ఈ హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టిక్కెట్టు విషయంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై వివేకానంద స్వయంగా తనతో చర్చించారని తెలిపారు. అవినాశ్‌రెడ్డికి టిక్కెట్టు ఇస్తే, వివేకానంద సపోర్ట్ చేశారని గుర్తుచేశారు. ఎప్పటికైనా వివేకానంద బతికి ఉంటే, తనకు ఇబ్బంది అవుతోందనే కారణంతోనే అవినాశ్‌రెడ్డి ఈ హత్య చేశారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో మొదటగా సీబీఐ విచారణ కావాలని జగన్ అన్నారని, ఆ తర్వాత వద్దని కూడా ఆయనే చెప్పారని తెలిపారు. వివేకా కేసును సిట్ అధికారులతో విచారణ చేయిస్తే సరిపోతుందని జగన్ చెప్పారని అన్నారు. ఈ కేసులో సీబీఐ అన్ని ఆధారాలను సేకరించిందని, ప్రధానంగా అవినాశ్‌రెడ్డి పేరును ప్రస్తావించిందని తెలిపారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఎందుకు ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేకపోయారు. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అనవసరం, అన్నా అనే పదానికి ఆయన కళంకం.. జగన్ మోహన్‌రెడ్డి అని అన్నారు.


