టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు తమిళనాడులో ఒక జాతీయ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేసిందని టీవీకే నేత అధవ్ అర్జున అన్నారు. అయితే, అది ఏ పార్టీయో వెల్లడించలేదు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి, అది జాతీయ పార్టీ అని స్పష్టమవుతోంది. అయితే, ఈ ఆఫర్‌ను విజయ్ తిరస్కరించినట్లు అర్జున తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభావాన్ని కాదనలేం. ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ తప్పకుండా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. ఆయన పార్టీ అధికారంలోకి వస్తుందా, రాదా అంటే ఇప్పుడే చెప్పలేం. కానీ, ఓటర్లను ప్రభావితం చేయగలదు.
అందుకే విజయ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నది ఒక ప్రచారం. ఇటీవల పలు సందర్భా్ల్లో కాంగ్రెస్ నేతలు విజయ్ పట్ల సానుకూలంగా మాట్లాడారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా విజయ్‌ను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారని ప్రచారం మొదలైంది. మొదట ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసిందని ప్రచారం జరిగింది. ఇదే అంశంపై టీవీకే నేత ఆదవ్ అర్జున మాట్లాడారు. ఒక జాతీయ పార్టీ విజయ్‌కు సీఎం పదవి ఆఫర్ చేసిందని వెల్లడించారు. అంతేకాదు.. మొదట 50 సీట్ల నుంచి మొదలై 90 సీట్లు, ఆపై సగం సీట్ల వరకు ఇచ్చేందుక సిద్ధమైనట్లు తెలిపారు. అయితే, సీఎం పదవి కోసం విజయ్ ఢిల్లీ ముందు తలవంచబోరని చెప్పారు. ఈ ఆఫర్‌ను విజయ్ తిరస్కరించారని అర్జున అన్నారు.


