హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై నౌకల రవాణా విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై పన్నులు విధించే ఆలోచన చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా సహా యూరప్ దేశాలు అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చమురు కొనుగోలుతోపాటు అనేక ఆర్థిక ఆంక్షల్ని పలు దేశాలు ఇరాన్‌పై విధించాయి. కానీ, ఇరాన్ అధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని మాత్రం వాడుకుని లబ్ధి పొందుతున్నాయి.
అందుకే ఇకపై ఈ జలసంధిని వాడుకునే దేశాలపై పన్నులు విధించాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. అందులోనూ తమ దేశంపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలపై ఈ ఆంక్షలు విధించే లక్ష్యంతో ఇరాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త సుప్రీం లీడర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే ఒక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఈ అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక దేశాలకు చమురు, ఆహారం, ఇతర ఉత్పత్తులు హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే వెళ్లాలి. దీంతో పలు దేశాలకు చెందిన నౌకలు షిప్పింగ్‌కు ఈ మార్గాన్ని వినియోగించుకుంటున్నాయి. అందుకే వీటికి టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ఈ మార్గంలో అనేక నౌకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.


