మతం మారిన వారి ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడికి సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడు దశాబ్ద కాలంగా పాస్టర్‌గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని పేర్కొంది.


