వంటగ్యాస్ (ఎల్ పిజి) సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. సిలిండర్ల బుకింగ్ గడుపు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజుల తర్వాతే రీఫిల్ బుకింగ్,ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 45 రోజుల తర్వాత బుకింగ్‌కు అనుమతి అంటూ పలు వార్తలు వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫేక్ వార్తలపై పెట్రోలియం శాఖ స్పందించింది.
వంటగ్యాస్ (ఎల్ పిజి) సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయంటూ వస్తున్న వార్తలు అబద్దం. ప్రస్తుతం అమలులో ఉన్న పాత నిబంధనలే కొనసాగుతాయని, ఎటువంటి కొత్త పరిమితులు విధించలేదని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం, రెండు సిలిండర్ల బుకింగ్‌ల మధ్య ఉండాల్సిన కనీస కాలవ్యవధిలో ఎటువంటి మార్పు లేదు. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రెండు బుకింగ్‌ల మధ్య కనీసం 45 రోజుల విరామం ఉండాలని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.


