ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గత పాలకులు మూఢనమ్మకాలతో నొయిడా అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. నొయిడాలో పర్యటిస్తే అది నాయకుల కెరీర్‌కు అపశకునంగా మారుతుందనే ప్రచారం చాలా కాలంగా ఉందని, అయితే తాను మాత్రం దీనిని పట్టించుకోలేదని చెప్పారు. మూఢనమ్మకాల కారణంగానే నొయిడాను నాయకులు పట్టించుకోలేదు. గత పాలకులు ఇక్కడకు వస్తే పదవి కోల్పోతామని భయపడుతుండేవారు. అందుకే నొయిడాకు రావడం మానేశారు అని మోదీ చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.
నాకు గుర్తుంది. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నొయిడాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాను. దీంతో సీఎం ఆందోళన చెందారు. కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండటమే కాకుండా నన్ను కూడా రావద్దని చెప్పారు. మోదీజీ, నొయిడా వెళ్లకండి ఇప్పుడే మీరు ప్రధానమంత్రి అయ్యారని సూచించారు. అయితే నేను నొయిడా ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తానని, అదే తనకు దీర్ఘకాలం దేశానికి సేవ చేసే అవకాశం ఇస్తుందని ఆయనతో చెప్పాను అని మోదీ తెలిపారు. ఒకప్పుడు నాయకులు వదిలేసిన ఈ ప్రాంతమే ఇప్పుడు ప్రపంచ నాయకులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని, స్వయం సమృద్ధి, నిర్భర భారత్‌కు గర్వకారణంగా నిలిచిందని ప్రధాని ప్రశంసించారు.


