పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్‌కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిటన్‌లో జరుగనున్న ఈ సమావేశంలో భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హోర్ముజ్ జలసంధిపై చర్చల కోసం భారతదేశంతో సహా పలు దేశాలను యూకే ఆహ్వానించింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి హాజరవుతున్నారు అని అన్నారు.
కాగా, మన దేశ నౌకలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, సురక్షితమైన రాకపోకలు కల్పించడానికి ఏ మార్గం అత్యుత్తమమో తెలుసుకునేందుకు ఇరాన్, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ సంప్రదింపులు ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు.గత కొద్ది రోజులుగా మేము జరిపిన చర్చల ఫలితంగా ఆరు భారతీయ నౌకలు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను సురక్షితంగా దాటగలిగాయి. సంబంధిత వర్గాలతో మా సంప్రదింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అని అన్నారు.


