రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ, స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే, వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ ఆ విధంగా మాట్లాడితే, మీకు చీమకుట్టినట్లు అయినా అనిపించ లేదా అంటూ వైసీపీ ఎంపీలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు మౌన ప్రేక్షకులయ్యారా? అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను కనీసం ఖండించరా? అని వైసీపీ ఎంపీలకు విజయసాయిరెడ్డి చురకలంటించారు.

































