కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్‌ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అన్నా… నన్ను మీతో కలిసి పని చేయమని దేవుడే పంపిండు అంటూ ఆయన కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.జీవన్ రెడ్డిని కేసీఆర్ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని దుశ్శాలువాతో సన్మానించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. కొంతసేపు ఇద్దరూ ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు.
జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరనున్నారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.


