జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఆయన జడ్జీగా ఉన్నారు. అవినీతి ఆరోపణ కేసులో ఆయనపై అభిశంసన ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. జడ్జీ హోదా నుంచి ఆయన్ను తప్పించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి భారీ ఎత్తున నోట్ల కట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో ఆయన ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. కానీ తక్షణమే అలహాబాద్ కోర్టు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీన ఆయన ఆ లేఖ రాశారు.
యశ్వంత్ వర్మ రాజీనామా చేయడం వల్ల.. ఆయనపై చేపట్టాల్సిన అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించినట్లు ఓ అధికారి ద్వారా తెలిసింది. రాజీనామా తర్వాత జస్టిస్ వర్మకు యధావిధిగా పెన్షన్‌తో పాటు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. ఒకవేళ ఆయన్ను పార్లమెంట్ తొలగిస్తే, అప్పుడు ఆయనకు బెనిఫిట్స్ అందేవి కాదు. ఢిల్లీ హైకోర్టు జడ్జీగా ఉన్న సమయంలో 2025 మార్చి 14వ తేదీన ఆయన ఇంట్లో భారీగా నగదును సీజ్ చేశారు. ఆయన ఉంటున్న క్వార్టర్స్‌లోని స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో జస్టిస్ వర్మతో పాటు ఆయన భార్య భూపాల్‌లో ఉన్నారు. స్టోర్‌రూమ్‌లో నగదును తాము పెట్టలేదని జడ్జీ చాలా సార్లు తెలిపారు.


