వాషింగ్టన్లో వైట్ హౌస్లో విడుదల చేసిన ప్రకటనలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అబ్బద్ధమని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. అలాగే ఆయన నేరాల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తి అసత్యాలుగా పేర్కొంటూ, ఇవి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలని విమర్శించారు. నన్ను అవమానకర వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్తో అనుసంధానించే అబద్ధాలు ఇవాళ్టితోనే ముగియాలి. నా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారికి నైతిక విలువలు, వినయం, గౌరవం లేవు. వారి అజ్ఞానంపై నాకు అభ్యంతరం లేదు కానీ నా ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న వారి దుష్ప్రయత్నాలను నేను ఖండిస్తున్నాను అని మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్లో స్వయంగా ప్రకటన చదివిన ఆమె, ఎప్స్టీన్తో తనకు ఎలాంటి అనుబంధం లేదని పునరుద్ఘాటించారు. న్యాయవాదులతో కలిసి ఈ నిరాధార ఆరోపణలను విజయవంతంగా ఎదుర్కొన్నాం అని తెలిపారు. ఇక ఎప్స్టీన్ కేసులో బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రజా విచారణ నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండాలి. అప్పుడు మాత్రమే నిజం వెలుగులోకి వస్తుంది అని పేర్కొన్నారు. ఈ ప్రకటన, ఇటీవలి కాలంలో ఎప్స్టీన్ వివాదం తగ్గుముఖం పట్టిన వేళ వెలువడటం గమనార్హం.


