విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వెంకట్ హీరోగా రూపుదిద్దుకున్న భారీ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరుడు. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ వేడుకలో హీరో వెంకట్ మాట్లాడుతూ సినిమా పట్ల తనకున్న మక్కువను, ఈ ప్రాజెక్ట్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. ఈ సినిమాను పూర్తి చేసే క్రమంలో తాను కేవలం నటుడిగానే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా భుజాన వేసుకోవాల్సి వచ్చిందని, ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మీడియా మిత్రుల సహకారం ఎంతో అవసరమని ఆయన కోరారు. సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, ముఖ్యంగా విలన్‌గా పరిచయమవుతున్న శ్రీహరి పైలా అద్భుతంగా నటించారని ప్రశంసించారు. గోవా మరియు ముంబై వంటి అందమైన లొకేషన్లలో రొమాంటిక్ మరియు మాస్ సాంగ్స్‌ను చిత్రీకరించామని, మణి జిన్న అందించిన సంగీతం, ముఖ్యంగా హైదరాబాద్ మాస్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనను పక్కా యాక్షన్ హీరోగా చూపిస్తూ దర్శకుడు రాజ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని, సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు.అన్ని హంగులతో సిద్ధమైన హరుడు మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.


