తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం ఓపెన్ టెండర్ ద్వారా జిఇఎం పోర్టల్‌లోనే కొనుగోలు చేశామని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఫోన్లను ఎక్కువ ధరగా చూపిస్తూ ఊహాజనిత కథనాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు ఇకపై తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.


