హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ, ఇరాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అలాంటి చర్యలకు దిగితే, తాము కూడా పర్షియన్ గల్ఫ్ తీరంలోని పోర్టులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. పర్షియన్ (అరేబియన్) గల్ఫ్, ఒమన్ సముద్ర తీరంలో భద్రత ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని పేర్కొంది. ప్రాంతీయ సముద్ర జలాల్లో రక్షణ అందరికీ ఒకేలా ఉండాలని అభిప్రాయపడింది. హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధిస్తే గల్ఫ్ తీరంలోని ఏ ఒక్క పోర్టుకు రక్షణ ఉండబోదని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ హెచ్చరించింది. తమ పోర్టుల్ని అమెరికా టార్గెట్ చేస్తే, తాము గల్ఫ్ దేశాల పోర్టుల్ని టార్గెట్ చేస్తామని స్పష్టం చేసింది.
రెండు రోజుల క్రితం ఇరాన్-అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని, ఇరాన్ పోర్టుల్ని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు అమెరికన్ నేవీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. హార్ముజ్‌ను దిగ్బంధించే ప్రక్రియ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అంటే, ఇకపై ఈ జలసంధి నుంచి నౌకలు వెళ్లడం, రావడం జరగవు. రెండు వైపులా నౌకల రవాణాను నిలిపివేస్తారు.


