తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి జేపీ నద్దా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. తమిళ నూతన సంవత్సరం కావడం విశేషం. ఈ సందర్భంగా పార్ట మేనిఫెస్టో విడుదల చేయడం మంచి పరిణామం అని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, బీజేపీ నేతలు కే అన్నామలై, తమిళిసై సౌందరరాజన్ వంటి కీలక నేతలు పాల్గొన్నారు.
ప్రజలకు అనేక ఉచిత పథకాల్ని బీజేపీ ప్రకటించింది. సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. మేనిఫెస్టోలోని కీలక హామీలివి. మహిళలకు ప్రతి నెలా రూ.2,000 ఆర్థికసాయం, ప్రతి కుటుంబానికి ఏటా రూ.10,000 ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్, జీరో ఎఫ్‌ఐఆర్ రిపోర్టింగ్ సిస్టమ్ అమలు, క్రూరమైన నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, బస్సులు, స్కూళ్లు, యూనివర్సిటీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, అర్హులైన మహిళలు ఈ స్కూటర్లు కొనుక్కునేందుకు రూ.25,000 ఆర్థిక సాయం, స్వయం సహాయక గ్రూపులకు, చిన్న తరహా, కుటీర పరిశ్రమలకు వడ్డీ లేకుండా రూ.50,00,000 వరకు రుణాలు, రైతులకు అదనంగా రూ.3,000 ఆర్థిక సాయం, జల్లికట్టులో పాల్గొనే ఎద్దుల్ని పెంచేవారికి ప్రతినెలా రూ.2,000 ఆర్థిక సాయం, జల్లికట్టులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, మహిళల పేరు మీద ఇల్లు కొంటే మూడు శాతం తక్కువ స్టాంప్ డ్యూటీ విధింపు వంటివి ఉన్నాయి.


