హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్భందించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా రియాక్ట్ అయ్యింది. ఇరానీ నౌకాశ్రయాలను మూసివేయడం ప్రమాదకరమని, బాధ్యతారాహితం అవుతుందని చైనా పేర్కొన్నది. నౌకలను అడ్డుకోవడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని చైనా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి గూవో జియాకున్ తెలిపారు. రెండు వర్గాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని, జలసంధి వద్ద అమెరికా తన బలగాల సంఖ్యను పెంచుతోందని, టార్గెట్ చేసి నౌకలను బ్లాక్ చేస్తున్నదని, దీంతో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉన్నట్లు జియాకున్ తెలిపారు. సీజ్‌ఫైర్‌ను గౌరవించాలని అన్ని దేశాలను చైనా కోరింది. చర్చలకు కట్టుబడి ఉండాలని చెప్పింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆచరణాత్మక అడుగులు వేయాలని గూవో తెలిపారు.


