అమెరికా, ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు జరగబోతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా రెండో దశ శాంతి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. ఈసారి శాంతి చర్చలు విఫలమైతే యుద్ధం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తామని, ఇందుకు సిద్ధమవుతున్నామని అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ పీట్ హెగ్సెత్ అన్నారు. ఇరాన్ ప్రతి కదలికనూ గమనిస్తున్నామని పేర్కొన్నారు.
అమెరికా నిఘా సంస్థలు ఇరాన్ ప్రతి కదలికనూ గమనిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైనిక చర్యలపై నిఘా ఉంది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ అమెరికా దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. గతంలోకంటే ఇప్పుడు యుద్ధానికి ఇంకా బలంగా సిద్ధమవుతున్నాం. మేం ఎనర్జీ సెక్టార్‌ను ఇంకా ధ్వంసం చేయలేదు. హార్ముజ్ దిగ్బంధనంతో ఎగుమతులు నిలిచిపోయాయి. త్వరగా అమెరికాతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటుందని ఆశిస్తున్నాం. శాంతి చర్చలు విఫలమైతే తిరిగి యుద్ధం తప్పదు. ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం హార్ముజ్ వద్ద ట్రాఫిక్‌ను అమెరికన్ నేవీ నియంత్రిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌కు నౌకాదళమే లేదు అని పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించారు.


