ప్రపంచానికి ఇది గుడ్‌న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురుచూసిన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఈ మేరకు సోషల్ మీడియాలో దీనిపై శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఇకపై హార్ముజ్ జలసంధి అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య గురువారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పది రోజులపాటు కాల్పుల విరమణ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలోనే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నంత కాలం జలసంధి తెరిచి ఉంచే అవకాశం ఉంది. ‘‘లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలు నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాం. ఈ ఒప్పందం అమలులో ఉన్నంతకాలం హార్ముజ్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని రకాల వాణిజ్య నౌకల్ని అనుమతిస్తాం. ఈ అంశంపై ఇప్పటికే అన్ని పోర్టులకు సమాచారం అందించాం. సంబంధిత రూట్ల గురించి కూడా తెలియజేశాం’’ అని అరాగ్చీ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. హార్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు.


