మద్రాస్ హైకోర్టులో ప్రముఖ నటి తమన్నా భాటియాకు భారీ షాక్ తగిలింది. సుమారు 16 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరకు ఆమెకు చుక్కెదురైంది. గతంలో పవర్ సోప్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన తమన్నా, తన ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కూడా ఆ సంస్థ తన ఫోటోలను ప్రకటనల్లో వాడుకుందని ఆరోపిస్తూ 2011లో కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు వాడినందుకు గాను కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆమె సివిల్ సూట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్, తమన్నా ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. ఆమె సమర్పించిన సబ్బు కవర్లు, ఇతర పత్రాలు సదరు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనకు పాల్పడిందని నిరూపించలేకపోయాయని కోర్టు అభిప్రాయపడింది.
గతంలోనే ఒక సింగిల్ జడ్జి ఆమె పిటిషన్‌ను కొట్టివేయగా, దానిని సవాలు చేస్తూ తమన్నా అప్పీల్‌కు వెళ్లారు. తాజాగా జస్టిస్ పి. వేల్మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవతిలతో కూడిన ధర్మాసనం పాత తీర్పునే సమర్థిస్తూ ఆమె అప్పీల్‌ను పూర్తిగా కొట్టివేసింది. ఈ తీర్పుతో నష్టపరిహారం రాకపోగా, ఇన్నేళ్లుగా సాగిన పోరాటం ఆమెకు నిరాశనే మిగిల్చింది.


