భారత్- చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయ లో ఘర్షణలు జరిగినప్పటి నుంచి గత ఐదారేళ్లుగా చైనా జాతీయులకు నిలిపేసిన పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి చైనా జాతీయులకు భారత్ టూరిస్ట్ వీసాల జారీని నిలిపేసింది.
టూరిస్టు వీసాల జారీలో పొరుగుదేశంతో ఉన్న సంబంధాలను సాధారణస్థితికి తీసుకురావడమే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం చైనా, హాంకాంగ్ పౌరులకు పర్యాటక వీసాలను జారీ చేయడం కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు గత ఏడాది నుంచి ఆంక్షల సడలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరుదేశాల ఒప్పందంతో నేరుగా విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన కైలాస మానససరోవర్ యాత్రను కూడా పునఃప్రారంభించారు.


