విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పర్యటించిన సీఎం, రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని అన్నారు. ఈ జిల్లాను అదృష్టం వరించిందని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నంబర్‌వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సెలార్ స్టీల్ కంపెనీ వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, ఇక ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని సీఎం అన్నారు. ఉద్యోగాల కోసం ఏపీకి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తామని తెలిపారు. ఏడాదిలోగా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్నారు. జులైలో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.
ఏపీకి ఇప్పటికే రూ.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని, 22 నెలల్లో 800కి పైగా ప్రాజెక్టులు వచ్చాయని తెలిపారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. గ్రీన్ ఎనర్జీతోనే ఏపీకి భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని.. అన్ని బస్సులను ఏసీ బస్సులుగా మారుస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకోండి.. రాయితీ ఇస్తాం అని ప్రకటించారు. 23 లక్షల మంది రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రూ.4 వేల కోట్లకుపైగా ట్రూడౌన్ ఛార్జీల భారం తగ్గించామని పేర్కొన్నారు.


