తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. శాసనమండలిలో ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయిన ఈ నియామకాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలపడంతో లైన్ క్లియర్ అయింది.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.తనను ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, పీసీసీకి, మంత్రి మండలికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ సర్కార్ మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తాను మరింత కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. జూబ్లీహిల్స్లో ముస్లింల ఓట్ల కోసమే నాకు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. సీఎం రేవంత్రెడ్డి మొదట్నుంచీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.


