దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) నే దిక్సూచి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో శతాబ్ది మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఏయూ దేశంలోనే టాప్-5 యూనివర్సిటీల్లో ఒకటిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూకు రూ.500 కోట్ల నిధులు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మరో రూ.500 కోట్లు కార్పస్ అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. వర్సిటీలు మన చారిత్రక సంపద అని అభివర్ణించారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఏయూలో రూ.64 కోట్ల పనులు ప్రారంభించామని చంద్రబాబు వివరించారు. సాధారణ వ్యక్తి, అసాధారణ శక్తిగా మారాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఇకనుంచి గ్లోబల్ సిటీ, ఇక అన్స్టాపబుల్ అని తెలిపారు. ఈ యూనివర్సిటీ స్థాపించేందుకు అనేక మంది కృషి చేశారని గుర్తు చేశారు.
తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి ఈ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారని చెప్పారు. రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్, దేశ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తు చేశారు. ఈ యూనివర్సిటీలో 58 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. ఈ వేడుకల్లో దేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పాల్గొన్నారు.


