పశ్చిమబెంగాల్లో బీజేపీకి విజయం ఖరారైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను అభినందించారు. వారి కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. మంచి పాలన అందించాలన్న బీజేపీ అభిమతమే అంతిమంగా పైచేయి సాధించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించారని ప్రధాని మోదీ అన్నారు. ఈ విజయం కోసం రాష్ట్రంలో పార్టీకి చెందిన కొన్ని తరాల కార్యకర్తలు నిరంతరం శ్రమించారని ప్రశంసించారు. కొన్నేళ్ల పాటు క్లిష్ట పరిస్థితుల్లో పోరాడారని అన్నారు. కార్యకర్తలే పార్టీ శక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్క కార్యకర్తకూ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. బీజేపీకి మర్చిపోలేని విజయం అందించినందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కూడా మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆశలను, కలలను సాకారం చేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అవకాశాలు, గౌరవం దక్కేలా పాలన అందిస్తామనిప్రధాని మోదీ హామీ ఇచ్చారు.


