తమిళనాడు లో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే పార్టీ కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పై బీజేపీ, అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలు చేస్తున్న వారిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీవీకే పార్టీ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమని, అందుకే తాము ఆ పార్టీకి అండగా నిలిచామని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం, ప్రజల తీర్పును గౌరవించడం కోసం, దక్షిణాది రాష్ట్రంలో ఎన్డీయేను అధికారానికి దూరంగా ఉంచడం కోసం టీవీకేకు మద్దతిచ్చామని అన్నారు. ఫలితాలు వెలువడిన రోజు రాహుల్ గాంధీ స్టాలిన్‌కు, మమతా బెనర్జీకి ఫోన్ చేశారని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ 100 స్థానాలలో ఓటు చోరీకి పాల్పడిందని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను, రాహుల్ గాంధీ కూడా సమర్థించారని గుర్తుచేశారు. కానీ ఎన్డీయేకు వ్యతిరేకంగా తమిళనాడులో టీవీకేకు మద్దతివ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం డీఎంకే మీడియా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. డీఎంకే, అన్నాడీఎంకే బీజేపీ ఆశీస్సులతోనే తమపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.


